Mini Social
"శ్రీ భక్తిసంజీవని మాసపత్రిక"

(1929 జనవరి నెల నుండి 1933 డిసెంబర్ నెల వరకు మొత్తము 60 సంచికలు క్రింద డౌన్లోడ్ చేసుకొనగలరు.)

శ్రీ భక్తిసంజీవని మాసపత్రికారంభము :-


              గుంటూరు మండలమందలి శ్రీవారి పర్యటనలో వారి వెంట శ్రీ సుబ్బదాసుగారును పదునైదు దినములు పాల్గొనిరి. గుంటూరు మండలమందలి బాపట్ల తాలూకాలో జేరి బాపట్లకు సమీపమందుండు జమ్ములపాలెము గ్రామ నివాసులు మ – రా – శ్రీ కుఱ్ఱా సిద్ధయ్య గారు వదానులై శ్రీ భక్తి సంజీవని – మాస పత్రికా ప్రతిష్ఠకుగాను రూ. 400 నాలుగు వందల రూప్యము లోసంగుంటచే శ్రీవారు కార్యనిర్వాహకులుగా 1929 జనవరి నెల నుండి శ్రీ భక్తిసంజీవని – మాస పత్రిక ప్రారంభింపబడుటకు నిర్ణయింప బడినది – శ్రీ కుఱ్ఱా సిద్ధయ్య గారు కమ్మ వారు – శ్రీ కోదండరామసేవక సమాజసభ్యులు. జాతి కమ్మయగుటయే గాక వీరి గుణము కమ్మయే, వీరి భక్తియు గమ్మయే. కారణమేమన నాంధ్ర దేశమందలి భవరోగార్తులగు మానవులకు భక్తియను దివ్య రసాయనము నందజేయ సంకల్పించిన శ్రీవారి కీతడు సహకరించుటే గొప్ప కైంకర్యము – పరమోపకారము – చిరస్మరణీయము.

శ్రీ భక్తిసంజీవని నిర్వచనము :-


              శ్రీ మద్రామాయణమందు జెప్పబడిన రామరావణ యుద్ధములో రక్కసుల మాయా యుద్ధమున స్మృతిచెడి పరాధీనులైన పడియున్న లక్ష్మణుడు వానరులు మున్నగువారి నుద్ధరించుటకై (జీవింప జేయుటకై) శ్రిమదాంజనేయ భగవానుడుహిమద్గిరి కూటమియందుగల సంజీవిపర్వతమును దెచ్చి యందలి సంజీవకరణి యను వనమూలికా ప్రభావమున వారిని జీవింపజేసిన పగిది శ్రీవారును దొంగయోగులు శుష్కవేదాంతులు మున్నగు రాక్షసులు మాయకు జిక్కి స్మృతిచెడి పరాధీనులైనవారికి భక్తిసంజీవని (భక్తి యనబడు సంజీవని మూలిక యను దివ్యౌషధము నీయదలచిరి – భక్తి సంజీవని యౌషధమా? పత్రికయా? భక్తిసంజీవని పత్రికారూపమైన దివ్యౌషధము.
              లోకమునందు రోగములు మూడు విధములు. ౧. ఆధులు, ౨. వ్యాధులు – ఇవి రెండు దేహా సంబంధమైనవి. ఆధులు మనస్సును పీడించునవి. వ్యాధులు శరీరమును బాధించునవి. మనుష్యునకు దేహముగాక దేహియైన జీవాత్మ యోకటికలదు. దీనికీ దేహసంబంధముచే బుట్టుట గిట్టుట యను సంసారరూపకమైన మృత్యురూపమైన బాధగలదు. ఇది మూడవదియైనను ప్రధమరోగ మిదియే. ఆధులకు వ్యాధులకు బీజభూతమిదియే. ఈ రోగము నివర్తించిన మరి యేరోగము పీడింపదు. చెట్లు కొమ్మ లెన్ని మార్లు కొట్టినను గాల్చినను వేరు బాగుండిన మరల మరల జిగిరించుచునే యుండును.
              అట్టులె భవరోగము భద్రముగా నుండువరకు నాధులకు వ్యాధులకు నెన్ని యౌషధములు తీసికొన్నను దత్కాలమున కుపశాంతి యేగాని వ్యాధి మొదలు ముట్ట నివారణముగాదు. రోగ నిదానము తెలియక పై లక్షణము లుపశమింప నౌషధమిచ్చు వైద్యుడు వృత్తిమాత్రోప జీవియే కాని సార్థకనామధేయుడు గాడు. వేరు నిర్మూలమైనచో వృక్ష మంతయు నశించును. ఇది తెలిసియు దెలియని వారు తత్కాలోపశమనములైన యౌషధముల దీసికొందురు. మరల మరల రోగపీడితులగుచుందురు. ఎరుకగాలవారు రోగము నిశ్శేషముగ నిర్మూలింప బ్రయత్నింతురు.
              ఆధులకు, వ్యాధులకు, భవబాధలను నిర్మూలింపగల యౌషధ మొకటియే కలదు. అది తప్ప రెండవది లేదు. ఆ యౌషధము భక్తి.


శ్లో !!        న వాసుదేవ భక్తా మశుభం విద్య తేక్వచిత్
జన్మమృత్యు జరావ్యాధి భయం వాప్యుపజాయతే !!         భారతము.

              వాసుదేవభక్తులకు నశుభమనునది తెలియరాదు. జననము – మరణము – ముసలితనము – రోగము – వీనివలన భయమైనను కలుగదు. కావున నాధులకు వ్యాధులకు, జనన మరణ బాధలకు భక్తి యొక్కటియే యమోఘమైన యౌషధము = ఈ యౌషధమును సేవించు మార్గము – పథ్యములో నైనవి భక్తి సంజీవని తెలుపును. భగవంతుడెవరి ననుగ్రహింప సంకల్పించునో వారీ యౌషధమును సక్రమముగ సపథ్యముగ సేవించి బాగుపడుదురు. అని శ్రీవారి యుద్దేశము – శ్రీ భక్తి సంజీవని పత్రికను బ్రకటించుటకు ముందు శ్రీ వారు కొన్ని నియమముల నేర్పారచిరి.

శ్రీ భక్తిసంజీవని నియమములు :-


1. ఇది ప్రతి హూణమాసారంభమున వెలువడు చుండును.
2. ముముక్షువులకు శ్రేయస్కరమైన సాంగభక్తి ప్రపత్తి మార్గప్రదర్శనము ముఖ్యోద్దేశము.
3. పత్రికను గుఱించిగాని తన్నిర్వాకాదుల గుఱించికాని వ్రాయబడు ముఖస్తోత్రాదు లిందు బ్రకటింప బడవు.
4. ఉపవిలేఖకుల యభిప్రాయములకు బత్రికానిర్వాహకు లుత్తరవాదులుగారు.
5. భిన్నాభిప్రాయములు ప్రకటింపబడునుగాని విద్వేషకారణమైన విషయములు – వ్యాసము – వాక్యము లిందు బ్రకటింపబడవు.
6. వ్యర్థచర్చలకు వితండవాదముల కిందు స్థలము లభింపదు.
7. ఉపవిలేఖకుల వ్యాసములు ప్రకటించుటకు నిరాకరించుటకు భాష సవరించుటకు బత్రికా ప్రధానలేఖకులు స్వతంత్రులు – నిరాకరణమునకు గారణము తెలుప బడదు. పోస్టేజి పంపిన యెడల మరల నవి పంపబడును.
8. భక్తిసంజీవని యన్యమత ద్వేష మెరుంగదు.
9. భక్తి విషయమెందుండినను గ్రహించును – మతత్రయ సామరస్యమునకై యత్నించును.
10. ఉపవిలేఖకులు పత్రముల కొకవైపుననే విశదములైన యక్షరములతో వ్రాయవలెను.
11. ఇందు బ్రకటింపబడు వ్యాసములయు బుస్తకములయు సర్వస్వామ్యము పత్రికాధిపతులదే. దీనికీ సమ్మతించిన వారే వ్యాసములు గ్రంథములు పంపవలయును.
12. 1929 సం!! జనవరి ౧ తేది మొదలు సంవత్సరగణనము.
13. ఈ పత్రిక వలన వచ్చు లాభము ఒంటిమిట్ట కోదండరాములవారిదే కావున దీనిని బోషించువారు శ్రీరామ కైంకర్యలాభమును సంపాదించినవారగుదురు.


||1929వ సంవత్సరము ||
||1930వ సంవత్సరము ||
||1931వ సంవత్సరము ||
||1932వ సంవత్సరము ||
||1933వ సంవత్సరము ||
||1934వ సంవత్సరము ||